Nagarjuna Sagar: పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు నిండుకుండల్లా మారిపోయాయి. శ్రీశైలం, నాగార్జున జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువగా విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి మొత్తంగా 67,977 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.33 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.80 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Read Also: Minister Seethakka: విద్యార్థులే ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత
ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ భారీగా వరద పెరిగింది. 8 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 64,636 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,55,845 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 72,845 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 311.4474 టీఎంసీలుగా ఉంది. ఇరు ప్రాజెక్టులను చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తున్నారు.