NTV Telugu Site icon

Vijayawada: చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. బెజవాడలో రికార్డ్‌ వర్షం

Vijayawada

Vijayawada

Vijayawada: భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్‌ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడలో కనివినీ ఎరగని రీతిలో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభవృష్టిలా వర్షం పడడంతో కాలనీలన్ని నీటమునిగాయి. ఏకధాటిగా రోజంతా వర్షం కురవడంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరం జలదిగ్బంధంలో చిక్కి విలవిల లాడుతోంది. ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్‌ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది.

Read Also: Rajanna Sircilla: ఏడతెరపి లేకుండా వర్షాలు.. వానలో తడుస్తూనే రాజన్న దర్శనం..

భారీ వర్షాలకు మొఘల్రాజపురం సున్నపు బట్టీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. విజయవాడ బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్‌ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.