Chandrababu Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
Also Read: AP Assembly Sessions: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లో ఆయన కీలకాంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. 2022లో బాబు పేరు బయటికి వచ్చిందని.. కానీ 2023 సెప్టెంబర్ 8న అరెస్ట్ చేయాలని భావించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.