Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్‌ప్రీత్‌ కౌర్ తొలగింపు.?

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. దీంతో గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి.

లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల పోటీ స్కోరు నమోదు చేసినప్పటికీ దానిని కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు ఎలిస్ పెర్రీ, అష్లే గార్డ్నర్ నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది.

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో “హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా?” ప్రశ్నించగా.. ముజుమ్దార్ అందుకు.. కెప్టెన్‌ను ఎంపిక చేయడం సెలెక్టర్ల నిర్ణయం. అయితే నా సమాధానం అవుననే అని అన్నారు. దీంతో హర్మన్‌ప్రీత్ నాయకత్వంపై కోచ్‌కు ఎలాంటి సందేహాలు లేవని స్పష్టమైంది. మరోవైపు భారత మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా కూడా హర్మన్‌ప్రీత్‌కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భారత జట్టును నడిపించడానికి ఆమెకంటే మెరుగైన నాయకురాలు లేరని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ భారత్‌ను ముందుండి నడిపించే అత్యుత్తమ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌నే. ఈ సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న మరో ఆటగాళ్లు కనిపించడం లేదని అన్నారు.

అయితే జట్టు ప్రదర్శనలో పలు అంశాల్లో మెరుగుదల అవసరమని అంజుమ్ అన్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు తగిన దూకుడైన ఆటతీరును అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో కనిపించే బ్యాటింగ్ భారత జట్టులో మాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 200 పరుగులు కాకపోయినా కనీసం 180 పరుగుల లక్ష్యంతో ఆడాలి. బ్యాటర్లు తమపై తాము మరింత నమ్మకం పెట్టుకోవాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ నిర్భయంగా ఆడాల్సిన అవసరం ఉంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా సరైన ఎంపికే. అయితే దూకుడైన ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పగల బ్యాటర్లు ఎవరన్న ప్రశ్నకు సమాధానాలు వెతకాల్సిన సమయం వచ్చింది అని అంజుమ్ చోప్రా సూచించారు.