Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.” అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..

Harish Rao Phone Tapping Case
