Site icon NTV Telugu

Harish Rao : నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..

Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది అంటూ హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (CWC), హైడ్రాలజీ అనుమతులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుమతులేదంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని, అనంతరం 2021లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన 113.795 టీఎంసీల నీటి లభ్యతను సీడబ్ల్యూసీ ఆమోదించిందని హరీష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా అందించాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Bhairavam : ‘భైరవం’ నుండి మరో పాట విడుదల..!

సమైక్య పాలనలో నీటి దోపిడికి కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని, కానీ ఇప్పుడు తెలంగాణ హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ 90% పనులను పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కోర్టు కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

“ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా అనుమతుల్లేవంటూ మాట్లాడడం దుర్మార్గం,” అని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగంలో బీఆర్ఎస్ విజయాలను తాము సాధించినవిగా చూపించుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. “తెలంగాణకు సాగునీటి విషయంలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్యాయం చేస్తే, బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో విజయ బావుటా ఎగురవేసింది,” అని హరీష్ రావు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగంలో సమర్థతను సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

Pulwama Attack: పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది.. అంగీకరించిన పాక్ సైన్యం

Exit mobile version