Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే భూముల విక్రయాలపై తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్క గజం భూమిని కూడా అమ్మలేదని, ఆ ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ భూములన్నింటినీ అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ అదే భూమి కోసం పోరాటం చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల మధ్య ఉన్న ఏకైక ప్రభుత్వ స్థలం ఇదేనని, దీనిని అమ్మితే లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పువని హెచ్చరించారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు.. భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును చూస్తే ఊసరవెల్లి కూడా ఉరి వేసుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికారంలోకి వస్తే ఒక్క అంగుళం భూమి కూడా అమ్మబోమని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏకంగా అంగుళం భూమి కూడా మిగలకుండా అమ్ముతున్నారని హరీష్ రావు విమర్శించారు. అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆయన మారిపోయారని ఆరోపించారు. ఈ భూముల వేలంలో పాల్గొనేవారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నామని, ఒకవేళ వేలంలో భూమి దక్కించుకున్నా భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతులూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. మియాపూర్ భూములను బీఆర్ఎస్ పార్టీనే కాపాడిందని, కనీసం జడ్జిమెంట్ కాపీ కూడా చేతికి రాకముందే ఆ భూములను కూడా అమ్ముతానని రేవంత్ రెడ్డి అంటున్నారని దుయ్యబట్టారు. కేవలం సాధారణ భూములే కాకుండా ఇండస్ట్రియల్ భూములను సైతం అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కన్నా చాలా ఘోరంగా తయారైందని విమర్శించారు. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చిచెప్పారు.

