Harish Rao: నవంబర్ 3న ఎన్బీడీఏ సమావేశం జరగబోతుందని ఎజెండా కూడా విడుదల అయింది. గోదావరి కావేరి లింక్‌ను ఈ ఎజెండాలో చేర్చుతూ అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఈ విషయంలో కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తారీఖున చంద్రబాబు నాయుడు లేఖ రాశారని.. వారంలో ఎజెండాలో చేర్చుతూ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. చంద్రబాబు లేఖ రాయగానే కేంద్రం మీటింగ్ ఏర్పాటు చేసింది. గోదావరిని చంద్రబాబు నాయుడు కబళిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ లేవనెత్తే వరకు మన రాష్ట్ర నేతలకు సోయి లేదని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ప్లాన్లను అడ్డుకున్నామని, ఇప్పుడు గోదావరి కావేరి లింక్ పేరుతో గోదావరి జలాల్ని కబళించే కుట్ర చేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పదేపదే చెప్పేవారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుంది. రేవంత్ రెడ్డి గురు దక్షణ అనుకొని వదిలి పెడుతున్నాడా? అంటూ నిలదీశారు. రేవంత్‌ను ప్రజలు తరతరాల వరకు క్షమించరన్నారు. హక్కులు ఉన్నపుడే గోదావరి కృష్ణా జలాలను వదిలి వేశారు. ఇప్పుడు శాశ్వతంగా నీళ్లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్ళు పైసలు పెట్టీ కొనలేమని మొన్న సీఎం అన్న మాటలను గుర్తు చేశారు. అంతటి ప్రాధాన్యత ఉన్న నీళ్లను ఎందుకు వదులు కుంటున్నారని ప్రశ్నించారు. ఎల్నీనో వస్తుందని తెలిసినప్పుడు దేవాదుల నీళ్ళని ఎందుకు వదిలి పెట్టావు? నువ్వు వదిలి పెడితే చంద్రబాబు నాయుడు ఒడిసి పట్టుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం కూడా మన కంటే తక్కువ నమోదు అయిందని, అయినా అక్కడ ఎలాంటి క్రాప్ హాలిడేలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. “మన నీళ్లను కిందకు వదిలి నందుకు ముందు క్షమాపణ చెప్పు. చంద్రబాబు నాయుడు లేఖ తెలంగాణ హక్కులకు మరణ శాసనం లాంటిది. బొల్లేప్లలిలో ప్రాజెక్ట్ కట్టుకుంటామని చంద్రబాబు అంటున్నారు. బొల్లేపల్లిలో కట్టుకుంటే తెలంగాణకు ఏం లాభం? సమ్మక్క సాగర్‌లో ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. అసలు ఇంటర్ లింకింగ్ నుంచి సమ్మక్క సాగర్‌ను ఎందుకు తీసి వేస్తున్నారు? బొల్లేపల్లి ద్వారా ఇంటర్ లింకింగ్ ఎందుకు చేస్తున్నారు? బొల్లేపల్లి ఏపీ కంట్రోల్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సమ్మక్క సాగర్‌కు సగం అనుమతులు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల సమ్మక్క సాగర్ డీపీఆర్ కూడా వెనక్కి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈ లేఖలో విన్ విన్ పరిస్థితి ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లాభం జరిగితే విన్ విన్ సిచువేషన్ అవుతుందా? ప్రపంచంలో నీళ్ల కోసం యుద్దాలు జరుగుతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నీటి వాటాలను ఎందుకు వదులుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి 16 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్రం వింటుందా? తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తుంది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏం చేస్తున్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎందుకు చిన్న చూపు. కేంద్రం తెలంగాణ గొంతు పిసుకుతాం అంటే ఊరుకోం. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకోం. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం. పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం.” అని హరీష్ రావు స్పష్టం చేశారు.

