NTV Telugu Site icon

Harish Rao : ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చింది

Harish Rao

Harish Rao

ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నామని హరీష్‌ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందని, ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామని ఆయన తెలిపారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదని అన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన విద్యుత్ సరఫరా చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే వారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, రాష్ట్ర పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని’ హరీష్ రావు మండిపడ్డారు.