NTV Telugu Site icon

Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!

Untitled Design

Untitled Design

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్‌ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే.

‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి.. ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మేము వేసిన పిటిషన్‌కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్‌గా 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌నే సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. ఈనెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది, ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలి. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలి. జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని దీక్ష విరమింప చేయమని నాకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి’ అని చేగొండి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.