Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్ అధికారుల అనుమతి ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది. తిరిగి ఫ్లెక్సీలను బాలినేని అనుచరులు యధాస్థానంలో ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలినేనికి పవన్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. బాలినేని జనసేనలో చేరికని గత కొంతకాలంగా టీడీపీ, జనసేన క్యాడర్ వ్యతిరేస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన ఫోటోలతో వీరమల్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించగా.. మున్సిపల్ అధికారుల అనుమతితో తిరిగి యధాస్థానంలో ఏర్పాటు చేశారు.
