NTV Telugu Site icon

Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.. ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి

Tirumala

Tirumala

Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని అంజనాద్రిపై ఈ నెల 14వ తేదీ(నేటి) నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అంజనాద్రి ఆకాశ గంగ, జాపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల వద్ద హనుమజ్జయంతి వేడుకలు జరగనున్నాయి. హనుమజ్జయంతి రోజున ఈ ఆలయాల్లో ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు నిర్వహిస్తారు. ఉదయం 7:30 గంటలకు బేడి ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామివారికి అభిషేకం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు టీటీడి తరపున జాపాలి ఆంజనేయస్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏడవ మైలు వద్ద ఆంజనేయస్వామి వారికి అభిషేకం జరగనుంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు.

Read Also: Hanuman Jayanti: ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల నుంచి ప్రత్యక్షప్రసారం

మరోవైపు హనుమజ్జయంతి సందర్భంగా నేడు పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆకాశగంగ, పాపనాశనం ప్రాంతాల వద్ద పార్కింగ్‌ సమస్య ఉంటుందని.. అందుకే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు గమనించి, సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.

Show comments