Hanuman Ansh: భక్తజనం హృదయాలను కొల్లగొడుతూ, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్ అంశ్ (Hanuman Ansh)’. రూ.2 కోట్లతో తీసిన ఈ చిన్న సినిమా, రిలీజ్ రోజున వెలవెలబోయే థియేటర్లతో ప్రారంభమైంది. కట్‌చేస్తే.. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ఇప్పటికే భారతదేశంలో ఏకంగా రూ. 130 కోట్ల నికర కలెక్షన్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తోంది. ఐదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ఈ సినిమా హవా అస్సలు తగ్గడం లేదు. పెద్ద స్టార్ కాస్ట్ లేదు, భారీ ప్రచారం లేదు, ఎలాంటి వివాదాలు లేవు. కేవలం ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వచ్చి “ఈ సినిమా తప్పకుండా చూడండి” అని ఒకరికొకరు చెప్పుకోవడం (వర్డ్ ఆఫ్ మౌత్) వల్లే ఇది సాధ్యమైంది. పరిశ్రమ విశ్లేషణ సంస్థ ‘సాక్నిల్క్’ నివేదికల ప్రకారం, 32వ రోజున వ్యాప్తంగా ఉన్న 7,343 షోల ద్వారా ఈ చిత్రం సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసింది. దీంతో భారత్‌లో దీని మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 156.20 కోట్లకు చేరుకోగా, నెట్ వసూళ్లు రూ. 132.13 కోట్ల మార్కును అందుకున్నాయి. ఐదో సోమవారం కూడా ఈ సినిమా థియేటర్లలో బలమైన పట్టును ప్రదర్శించింది. రోజంతా కలిపి సగటున 34.63 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలలో 14.77 శాతం నమోదు కాగా, మధ్యాహ్నం 30.85 శాతానికి పెరిగింది. ఇక సాయంత్రం 41.62 శాతంతో పాటు రాత్రి షోలకు అత్యధికంగా 51.31 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు.
అసలు ఈ సినిమా కథేంటి?
ఈ చిత్రం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, బోధనల ఆధారంగా రూపొందింది. విశాల్ చతుర్వేది రాసిన ‘దివ్య మోడ్’ అనే పుస్తకం ఆధారంగా, ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఒక ట్రైలజీగా రాబోతుండగా, ఇప్పటికే రెండో భాగానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా కథ అందరినీ ఆకట్టుకుంది. తల్లిని కోల్పోయి, దేవుడిని కలిస్తే తన తల్లిని మళ్లీ చూడవచ్చనే నిష్కల్మషమైన నమ్మకంతో వెతికే ఓ అమాయకపు బాలుడితో మొదలవుతుంది. ఆ అన్వేషణలోనే దేవుడు అంటే కేవలం తర్కంలోనో, సాధనల్లోనో కాకుండా ప్రేమ, సేవ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలోనే ఉన్నాడని ఆ బాలుడు గ్రహిస్తాడు. శోభినావ్ సత్య ‘మహారాజ్-జీ’ (నీమ్ కరోలీ బాబా) పాత్రలో జీవించగా చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెడ్గే ముఖ్య పాత్రల్లో నటించారు. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ కుటుంబ కథా చిత్రంలో ఎలాంటి హింస లేదా అశ్లీలత లేకపోవడంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
అయితే “‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh)” పూర్తి బయోపిక్ లేదా డాక్యుమెంటరీ కాదు. ఇది నీమ్ కరోలీ బాబా జీవిత సంఘటనలు, భక్తుల అనుభవాల ఆధారంగా తెరకెక్కించిన ఒక సినిమాటిక్ డ్రామా. బాబా అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. ఆయన ఉత్తరప్రదేశ్ లోని అక్బర్ పూర్ లేదా ఫిరోజాబాద్ ప్రాంతంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 11 ఏళ్ల పిన్న వయస్సులోనే వివాహమైనప్పటికీ, సాధువుగా మారడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కానీ తండ్రి కోరిక మేరకు మళ్లీ తిరిగి వచ్చి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో సాధారణ గృహస్థుడిగా జీవితాన్ని గడిపారు. ఆయన కేవలం కొండల్లోనో, అడవుల్లోనో దాక్కున్న సన్యాసి కాదు. సంసార జీవితంలో ఉంటూనే ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన మహనీయుడు.
లక్ష్మణ్ నారాయణ్ శర్మకు “నీమ్ కరోలీ” అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒకసారి ఆయన రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తుండగా, టీసీ ఆయనను ‘నీబ్ కరోరీ’ అనే చిన్న గ్రామంలో రైలు దింపేశారు. ఆ తర్వాత ఆ రైలు ఎంతకీ ముందుకు కదల్లేదు. చివరకు రైల్వే సిబ్బంది తమ తప్పు తెలుసుకుని ఆయనను మళ్లీ రైలు ఎక్కమని కోరారు. ఆ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ కట్టించాలని, సాధువులను గౌరవించాలని రెండు షరతులు పెట్టారు. వారు అంగీకరించాక రైలు కదిలింది. ఆ గ్రామం పేరే కాలక్రమేణా ‘నీమ్ కరోలీ’గా మారి, ఆయన పేరుగా స్థిరపడింది.
తన జీవితకాలంలో లక్ష్మణ్ నారాయణ్ శర్మ నైనితాల్ సమీపంలోని కైంచీ ధామ్ (1964), బృందావన్ లో ప్రధాన ఆశ్రమాలను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరిట వందకు పైగా ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 11, 1973న ఆయన బృందావన్ లోని ఆసుపత్రిలో “జై జగదీష్ హరే” అని జపిస్తూ మహాసమాధి చెందారు. లక్ష్మణ్ నారాయణ్ శర్మ భౌతికకాయం సమాధి బృందావన్ ఆశ్రమంలో ఉంది. ఆయన మహాసమాధి సాధించిన గ్రెగోరియన్ తేదీ సెప్టెంబర్ 11 (2026 నాటికి 53వ వార్షికోత్సవం) అయినప్పటికీ, ఆశ్రమంలో మాత్రం ప్రతి ఏటా భద్రపద శుక్ల చతుర్దశి (అనంత చతుర్దశి) నాడే వార్షిక భండారా (అన్నదానం) నిర్వహిస్తారు. 2026లో ఈ అనంత చతుర్దశి సెప్టెంబర్ 25 శుక్రవారం నాడు వస్తుంది.
లక్ష్మణ్ నారాయణ్ శర్మను ‘హనుమాన్ అంశ్’ ఎవరు?
లక్ష్మణ్ నారాయణ్ శర్మ ప్రతి విషయంలోనూ తనను తాను ముందుంచుకోకుండా, అంతా హనుమంతుడి దయే అని చెప్పేవారు. ఆయన ఏ గ్రంథాలూ రాయలేదు, క్లిష్టమైన నియమాలు పెట్టలేదు. ఆయన బోధన అంతా కేవలం మూడే మూడు సూత్రాల్లో ఉంటుంది: “అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి, దేవుడిని స్మరించు”. ఈ సినిమా చూసిన తర్వాత నీమ్ కరోలీ బాబా మార్గంలో పయనించాలనుకునే వారు, తమ ఇంట్లోనే చిన్నగా హనుమాన్ చాలీసా పఠనంతో లేదా ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇక, ఈ సినిమా ప్రస్తుతానికి హిందీ భాషలో మాత్రమే విడుదలైంది. త్వరలో తెలుగు సహా ఇరత ప్రాంతీయ భాషల్లోకి అనువాదించే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రతి హిందూ కుటుంబం తప్పకుండా చూడాలి.

