హైతీలో సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.
హైతీ (Haiti)లో 72 గంటలపాటు అత్యవసర పరిస్థితిని విధించారు. అలాగే రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోర్ట్ ఔ ప్రిన్స్ జైలు నుంచి శనివారం వేల సంఖ్యలో కరుడుగట్టిన నేరగాళ్లు తప్పించుకుని పోయారు.
ఇదిలా ఉంటే ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా.. 4,000 మంది ఖైదీలు పరారయ్యారు. 2021లో దేశాధ్యక్షుడు జువెనల్ మోయిసె హంతకులు కూడా ఇదే జైలులో ఉన్నారు. వారు తప్పించుకొన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రధాని హెన్రీ రాజీనామా చేయాలంటూ సాయుధ మూకల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గ్రూపులను సమన్వయం చేసుకొంటూ బార్బెక్యూ అనే నేరస్థుడు ఈ దాడులకు తెగబడ్డాడు. ప్రస్తుతం ఆ గ్రూపులు రాజధానిని 80 శాతం తమ అధీనంలోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది.
హైతీలో 2020 నుంచి జరుగుతున్న గ్యాంగ్‌వార్‌ల్లో ఇప్పటివరకు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకొని గ్యాంగ్‌లు దాడులు చేశాయి.
2021లో దేశాధ్యక్షుడు మోయిసె హత్య తర్వాత హెన్రీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పార్లమెంట్, అధ్యక్ష ఎన్నికలను తరచూ వాయిదాలు వేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగడం లేదు. 1.1 కోట్ల మంది ఉన్న జనాభాకు పోలీస్ దళంలో 9 వేల మంది సిబ్బందే ఉన్నారు. దీంతో సాయుధ గ్యాంగ్‌లను అదుపుచేయలేక పోతున్నారు.