Site icon NTV Telugu

Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు.. రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి!

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy on Politicians Language: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాలని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో రాజకీయ నాయకుల భాషపై మాత్రమే కాదు ఉచిత పథకాలు, అవినీతి, బనకచర్ల ప్రాజెక్టు, సాగర్ ఎడమ కాలువ లాంటి తదితర విషయాలపై స్పందించారు. ‘ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుంది. అధికారుల అవినీతి పెరిగిపొయింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో పెరిగిన అవినీతిని నియంత్రించాలి’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Also Read: Vana Mahotsavam 2025: పెట్రోల్ బంక్‌లలో ఫ్రీగా సీడ్ బాల్స్.. 18 కోట్ల మొక్కలు టార్గెట్!

‘దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేతల మధ్య పరస్పర దాడులు సరికాదు. సభ బయట సభ్యుల మధ్య జరిగే దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగు నీటిని ముందుగానే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Exit mobile version