Site icon NTV Telugu

Crime News: కన్న తండ్రే కాలయముడు.. కూతురును రివాల్వర్‌తో కాల్చిన కసాయి!

Radhika Yadav, Deepak Yadav

Radhika Yadav, Deepak Yadav

కూతురి పట్ల కన్న తండ్రే కాలయముడయ్యాడు. నిర్ధాక్షిణ్యంగా తలకు రివాల్వర్ పెట్టి కాల్చి చంపేశాడు. హర్యాణా గురుగ్రామ్‌లో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతే కాదు కన్నకూతుర్ని చంపానని.. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నాడు ఆ తండ్రి. అసలు టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో ఏం జరిగింది?

హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను తండ్రే దారుణంగా రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. రాధిక.. జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉదయం రాధిక యాదవ్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుండగా.. ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె మెడకు తగలగా.. రెండు బుల్లెట్లు వెనుక భాగంలో తగిలాయి. వెంటనే ఇంట్లోనే ఉన్న మేనమామ ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

కన్నకూతురుపైనే అత్యంత దారుణంగా రివాల్వర్ ఉపయోగించి బుల్లెట్ల వర్షం కురిపించి చంపేసిన తండ్రి దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాధికా యాదవ్‌ను తానే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు దీపక్ యాదవ్. ఆమె టెన్నిస్ అకాడమీ నడపడం ఇష్టం లేకపోవడం వల్లే చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతే కాదు.. దీపక్ యాదవ్ పాల కోసం సొంతూరు వజీరాబాద్ వెళ్లినప్పుడల్లా కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గు లేదని జనం అంటున్నారు. దీంతో టెన్నిస్ అకాడమీ మూసేయాలని పలుమార్లు కూతురుతో గొడవ పెట్టుకున్నాడు దీపక్. అంతే కాదు సోషల్ మీడియాలో లైమ్ లైట్‌లో ఉండేందుకు నిత్యం రీల్స్ చేసిది రాధికా యాదవ్. కానీ అది తండ్రికి ఇష్టం లేదు. ఈ అలవాటు కూడా మానుకోవాలని పలుమార్లు చెప్పాడు. కానీ రాధిక పట్టించుకోలేదు. ఈ పరిణామాలన్నీ కూతురిపై కోపాన్ని పెంచాయి.

Also Read: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్‌ను చంపేసిన పని మనీషి!

ఇప్పటికే కూతురిపై పగతో రగిలిపోతున్న తండ్రి దీపక్‌కు.. కూతురికి సంబంధించి ఒక మ్యూజిక్ వీడియో కూడా నెట్ లో రావడం మరింత ఆజ్యం పోసింది. ఆ వీడియోలో రాధిక ఓ యువకుడికి ప్రియురాలిగా నటించింది. ఆ వీడియోలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండటంతో కూతురిని తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. వీడియోలు చేయొద్దని చెప్పినా వినకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గతంలో దీపక్ ఓల్డ్ గురుగ్రామ్‌లో “డీప్ యాక్సెసరీస్” అనే కార్ల విడిభాగాల షాప్ నడిపించేవాడు. కానీ దానిని తర్వాత మూసివేశాడు. పలు బిల్డింగ్స్ ద్వారా అద్దె ఆదాయం కూడా వస్తోంది. రాధిక టెన్నిస్ కెరీర్ కోసం దీపక్ చాలా కష్టపడ్డాడని స్థానికులు వెల్లడించారు. మొత్తానికి అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని దీపక్ చంపడం హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version