Site icon NTV Telugu

Pemmasani Chandrashekar: గోరంట్ల రిజర్వాయర్‌ను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు. సుమారు 13 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో నేటికీ నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కాలేదని.. నేటికీ దాదాపు 3 లక్షల మంది ప్రజలు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో రాబోయే 20-30 ఏళ్లలో పెరగబోయే జనాభాకు ఉపయోగపడేలా పలు వాటర్ పథకాలను అమలు చేసిందన్నారు.

అందులో భాగంగానే 40% కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో 30 శాతం స్థానిక కార్పొరేషన్ నిధులతో మెగా ఈఎల్‌ఎస్‌ఆర్ రిజర్వాయర్ నిర్మాణానికి టీడీపీ హయాంలోనే గోరంట్లలో పనులు మొదలుపెట్టారన్నారు. తద్వారా గుంటూరు విలీన 10 గ్రామాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని సుమారు 3-4 లక్షల మంది ప్రజలకు నీరు అందించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 40 శాతం నిధులతో పనులు ప్రారంభించగా, 2019 ఎన్నికలు రావడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఎక్కడ పనులు అక్కడే గాలికి వదిలేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో గడిచిన 5 ఏళ్లుగా నిర్మాణాలు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయన్నారు. ఇదే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి ఉంటే గ్రావిటీ ద్వారా యావత్ గుంటూరు ప్రజలకు తాగునీరు అందించగలిగే వాళ్లమన్నారు. గుంటూరు ప్రజలకు నీరు ఎందుకు అందడం లేదు అంటే అసలు కారణం ఇదేనని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు సమీకరించి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

కార్పొరేషన్‌లో గుంటూరు నగర శివారులోని 10 గ్రామాలను విలీనం చేసే ముందు మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, ఇతర అవసరాలను తీరుస్తామని పంచాయతీలలో తీర్మానాలు చేసి మరీ ఆమోదించారని ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అన్నారు.. 2014 తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుందన్నారు. లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి గోరంట్ల కొండపై ప్రాజెక్టుకు అప్పట్లో శ్రీకారం చుట్టారన్నారు. రూ. 126 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించామని.. 2014-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో నిర్మాణాలు చేపట్టగా, 2019 తర్వాత పనులు మూలనపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ నూకవరపు బాలాజీ, గోరంట్ల మాజీ సర్పంచ్ కందుల సుబ్బారావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version