Site icon NTV Telugu

Road Accident: టెక్సాస్‌లో గుంటూరు విద్యార్థిని మృతి.. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా..!

Road Accident

Road Accident

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు దీప్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని పడింది. శనివారం నాటికి దీప్తి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా దీప్తి మరణించడం ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.

గుంటూరు రాజేంద్రనగర్‌ రెండో లైనులో నివాసం ఉంటున్న హనుమంతరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమార్తె దీప్తి. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌లో దీప్తి టాపర్‌గా నిలవడంతో.. తల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికా పంపారు. కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లిన దీప్తి.. టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చేస్తోంది. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఏప్రిల్ 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయాలు కాగా.. స్నిగ్ధకు సైతం గాయాలయ్యాయి.

Also Read: MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్‌టన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్‌ రేసులో ఎంఐ

దీప్తి ఫ్రెండ్స్ ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు చెప్పగా.. మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సంప్రదించారు. అమెరికాలో ఉన్న పెమ్మసాని విషయం తెలుసుకుని.. తన బృందాన్ని అప్రమత్తం చేసి దీప్తికి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. చికిత్స పొందుతూ ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Exit mobile version