NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి..

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని.. ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని అడ్డుకున్నారని.. 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. రాజధానిలో ఐదు వేల టిడ్కో గృహాలు వృథాగా వదిలేశారన్నారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ధ్వంసం చేశారని.. ఆర్ 5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు.

రాజధానిలో ఒకే వర్గం వారికి భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని.. 20 వేల మంది సన్న చిన్న కారు రైతులు భూములు ఇచ్చారని ఆయన చెప్పారు. రాజధానిలో 70 బహుళ అంతస్తుల భవనాలు వృథాగా వదిలేశారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వదిలేశారని.. నిర్మాణాలు జరుగుతుంటే లక్ష మందికి పని దొరికేదన్నారు. అంబేద్కర్ స్మృతి వనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారన్నారు. రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందన్నారు. రాజధానికి ఖర్చు చేసిన పది వేల కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిలో హృదయ విదారకమైన పరిస్థితి కన్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Show comments