Gunmen Attack: ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు. ముష్కరుల దాడి తర్వాత అనేక మంది స్థానికుల ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి మాంగు ప్రాంతంలోని మూడు గ్రామాలను లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారు. ముష్కరులు అనేక ఇళ్లకు నిప్పంటించారని స్థానికుడు పేర్కొన్నాడు. మరోవైపు.. అమాయకులపై ముష్కరులు జరిపిన దాడులను ఉత్తర మధ్య నైజీరియా గవర్నర్ సైమన్ లలాంగ్ ఖండించారు. అమాయక ప్రజలపై దాడితో తాను కలవరపడ్డానని ఆయన తెలిపారు. నిందితులను తక్షణమే గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన భద్రతా బలగాలను గవర్నర్ సైమన్ లలాంగ్ ఆదేశించారు.
Read Also: Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. డిప్యూటీగా డీకే శివకుమార్.. రేపే ప్రమాణం!
ఇదిలా ఉండగా మరో ఘటనలో ఆగ్నేయ నైజీరియాలో అమెరికా ఎంబసీ సిబ్బందితో వెళ్తున్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు అమెరికా కాన్సులేట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం వారి మృతదేహాలకు నిప్పంటించి దగ్ధం చేశారు. కాన్వాయ్‌లోని వాహనాలకూ నిప్పంటించారు. అనంబ్రా రాష్ట్రంలోని ఓగ్బారు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ముష్కరులు అక్కడి నుంచి పరారయ్యారని అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో సాధారణ పౌరులు లేరని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ.. నైజీరియా భద్రతా ఏజెన్సీతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అమెరికా సిబ్బంది రక్షణ తమకు అత్యంత ముఖ్యమని, అందుకోసం కావాల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.