Declared Dead Alive: ఇది నిజంగా అద్భుతం.. ఎందుకంటే వైద్యులు చనిపోయాడని ప్రకటించిన వ్యక్తికి అకస్మాత్తుగా 15 నిమిషాల తర్వాత ప్రాణం తిరిగి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. గుజరాత్‌లోని సూరత్‌లో. సూరత్‌లోని న్యూ సివిల్ హాస్పిటల్‌లోని వైద్యులు ఒక రోగి మరణించినట్లు ప్రకటించారు, కానీ 15 నిమిషాల తర్వాత, ఆయన గుండె అకస్మాత్తుగా మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ సంఘటన కేవలం ఆసుపత్రిలో మాత్రమే కాకుండా మొత్తం సూరత్ నగరంలో చర్చనీయాంశంగా మారింది.
READ ALSO: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
చనిపోయిన వ్యక్తి బతికి వచ్చాడు..
అంకలేశ్వర్‌కు చెందిన 45 ఏళ్ల రాజేష్ పటేల్‌కు ఆరోగ్యం క్షీణించడంతో సూరత్‌లోని న్యూ సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు.. రోగి తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడని, ఆయన పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నదని వెల్లడించారు. అనంతరం వైద్య బృందం తమ శాయశక్తులా ప్రయత్నించిన రోగి బతక లేదు. దీంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న రోగి కుటుంబ సభ్యులు ఏడుపు ప్రారంభించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ ప్రకటన వచ్చిన దాదాపు 15 నిమిషాల తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విషయం జరిగింది.
రోగి శరీరంలో స్వల్ప కదలిక రావడం మొదలై, హృదయ స్పందన అకస్మాత్తుగా మానిటర్‌లో మళ్లీ కనిపించడం ప్రారంభమైంది. వైద్యులు వెంటనే రోగిని తిరిగి ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కి తరలించారు. వైద్య బృందం అత్యవసర చికిత్సను ప్రారంభించగా, క్రమంగా రోగి హృదయ స్పందన సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేష్ చౌదరి మాట్లాడుతూ.. “నా 30 ఏళ్ల కెరీర్‌లో ఒక రోగి చనిపోయినట్లు ప్రకటించి, ఆ తర్వాత ఆ వ్యక్తి తిరిగి బ్రతకడం ఇదే మొదటిసారి” అని అన్నారు. గుండెపోటు వచ్చిన రోగులకు మేము చాలాసార్లు CPR చేశాము. కానీ ఎటువంటి జోక్యం లేకుండా గుండె దానంతట అదే కొట్టుకోవడం చాలా అరుదు” అని వెల్లడించారు.
వైద్య నివేదికల ప్రకారం.. రాజేష్ పటేల్ తీవ్రమైన గుండె వైఫల్యం, రక్తంలో అధిక చక్కెర స్థాయిలతో బాధపడ్డాడు. ఆయన చనిపోయినట్లు ప్రకటించినప్పుడు, శారీరంలో అన్ని సంకేతాలు అదృశ్యమయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. శ్వాస, హృదయ స్పందన లేదు. అయినప్పటికీ ఆయన గుండె 15 నిమిషాల తర్వాత మళ్లీ దానంతటదే కొట్టుకోవడం ప్రారంభించింది. దీనిని వైద్యులు “స్పాంటేనియస్ కార్డియాక్ రివైవల్” అని పిలుస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ పటేల్ ఐసియులో ఉన్నాడు. వైద్యుల బృందం ఆయన పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. రోగి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, రాబోయే కొన్ని రోజులు ఆయనకు చాలా కీలకమని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
READ ALSO: Moto X70 Air: ఆపిల్ ఎయిర్ లాంటి స్లిమ్ స్మార్ట్‌ఫోన్ మోటో X70 ఎయిర్ విడుదల.. కేక పుట్టించే ఫీచర్స్