GT vs RR Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకోగా, ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చే కీలక సమయం వచ్చింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మే 27న న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో పోరాడనుంది.
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో లీగ్ దశలో ఆడినా, క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైన గుజరాత్ ఇప్పుడు తిరిగి బలంగా పుంజుకుని ఫైనల్ చేరాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ విజయం సాధించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టును టోర్నీ నుంచి బయటకు నెట్టి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మొత్తం 10 సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఏకంగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా, నాకౌట్ మ్యాచ్ కావడంతో ఒత్తిడిని బాగా ఎదుర్కొనే జట్టే విజేతగా నిలిచే అవకాశముంది.
గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. అలాగే రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడా వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ వైపు చూస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు ప్రధాన బలం.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (C), ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్‌మైర్, సమ్ కరన్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
