NTV Telugu Site icon

Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్

Group 1

Group 1

విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి తొలగించారని.. గతంలో సిద్ధం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ఓ గ్రూప్-1 అభ్యర్థి గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారో చెప్పాలని గ్రూప్-1 అభ్యర్థులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ఫలితాలు నిలిపివేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు. డిజిటల్ వాల్యూయేషన్‌ అంతా పారదర్శకంగానే జరిగిందని చెప్పారని.. కానీ ఇప్పుడు అభ్యర్థులనే మార్చి తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అర్హత లేనివారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐతో విచారణ చేయించి 202 మందికి న్యాయం చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Chandrababu : ఆ నిబంధన రాష్ట్ర దుస్థితికి.. అసమర్థ పాలనకు నిదర్శనం

కాగా గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్‌ను కలవడానికి వచ్చిన సమయంలోనే రాజ్ భవన్‌కు ఏపీపీఎస్సీ అధికారి గౌతమ్ సవాంగ్ వచ్చారు. ఆయన యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రూప్-1 ఫలితాల విషయంలో తాజా పరిణామాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.