Site icon NTV Telugu

Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు

Samadulu

Samadulu

Crime News : రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయి. గోతులు ఉన్నాయి కానీ… అందులో అస్తికలు మాయమయ్యాయి. గ్రామస్తులు, ఆ సమాధులకు చెందిన కుటుంబసభ్యులు షాక్‌ అయ్యారు..!! చనిపోయిన తమ బంధువుల అస్తికలను ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారని ఆందోళన చెందారు..? క్షుద్రపూజలేమైనా జరిగాయా.. అని కంగారెత్తారు..!! ఇంతకూ సమాధులను ఎవరు తవ్వినట్టు…!! నిజంగానే క్షుద్రపూజలు జరిగాయా..? అస్తికల మాయం వెనక దాగున్న మిస్టరీ ఏంటి.. మహేశ్వరం మండలం డబిల్ గూడలో సర్వే నెంబర్ 24లో ఉన్న స్థలం. ఈ స్థలంలో దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఉండేవి. రాత్రికి రాత్రి ఈ సమాధులు మాయం అయ్యాయి. అస్తికలు కూడా కనిపించకుండాపోయాయి. విషయం తెలుసుకున్న సమాధులకు చెందిన కుటుంబసభ్యులు.. ఆ స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన తమ కుటుంబసభ్యులకు చెందిన సమాధులను ఎవరు తవ్వారో తెలియక ఆందోళన చెందారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పోగయ్యారు.

Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట

ఒకానొక దశలో క్షుద్రపూజల కోసం ఎవరో తవ్వినట్లు ఉన్నారు అంటూ పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ.. ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాధులను తవ్వి.. అస్తికలను కూడా మాయం చేసింది రియల్‌ ఎస్టేట్‌ గద్దలని తెలుసుకున్నారు. తమ వెంచర్‌కి సమాధులు అడ్డుగా ఉన్నాయని.. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే సమాధులను పెకిలించేశారు. అస్తికలను కూడా మాయం చేశారు… జన్యపాగ కుటుంబానికి చెందిన వ్యక్తులు… 2006లో తమ 3 ఎకరాల 5 గుంటల భూమిని సినిమా డిస్ట్రిబ్యూటర్‌ రవివర్మకి అమ్మారు. ఒక గుంట మినహా.. స్థలం మొత్తాన్ని అమ్మారు. ఆ గుంట జాగాలో తమ కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేందుకు ఆ గుంట స్థలాన్ని మాత్రం ఉంచుకున్నారు. ఈ 19 ఏళ్లలో చనిపోయిన తమ వాళ్ల 4 సమాధులు అక్కడే నిర్మించారు.

వీళ్ల స్థలం కొన్న రవివర్మ.. తన స్థలంలోకి వెళ్లాలంటే సమాధులు అడ్డుగా ఉన్నాయని భావించాడు. కనీసం జన్యపాగ కుటుంబీకులకు సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే సమాధులను తొలగించాడు రవివర్మ. కనీసం అస్థికలు కూడా లేకుండా మాయం చేశారు… కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని… సమాధుల నుంచి తొలగించిన అస్తికలను తమకు అప్పగించేలా చూడాలని కోరుతున్నారు జన్యపాగ కుటుంబసభ్యులు. సమాధులు తవ్విన చోట కూర్చుని ఆందోళన చేశారు. ఘటనపై రవివర్మను సంప్రదించగా.. తనకేం సంబంధం లేదంటున్నాడని చెప్తున్నారు బాధితులు.

Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..

Exit mobile version