NTV Telugu Site icon

Anurag Thakur: “గాజా గురించి మాట్లాడే రాహుల్ గాంధీ బంగ్లా హిందువులపై మౌనం ఎందుకు.?”

Anurag Thakur

Anurag Thakur

Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా, గాజా పట్ల ఆందోళన చెందే కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. శుక్రవారం లోక్‌సభలో మట్లాడుతూ..బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు మతపరమైన మైనారిటీల శాంతి, భద్రత మరియు అభివృద్ధికి హామీ ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతికి గుర్తు చేశారని అన్నారు.

Read Also: Scrub Typhus: “స్క్రబ్ టైఫస్” కారణంగా హిమాచల్‌లో మొదటి మరణం..

మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల సంఘటనల గురించి మనమంతా ఆందోళన చెందుతున్నామని, ప్రధాని మంత్రి మోడీ ఆ దేశంలో హిందువుల భద్రతకు హామీ ఇవ్వాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు నొక్కి చెప్పారని అన్నారు. అయితే బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. గాజా గురించి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ పొరుగుదేశంలో హిందువుల పరిస్థితిపై ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి..? అని అడిగారు.

గురువారం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేసిన ముహమ్మద్ యూనస్‌కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హిందువులు మరియు అన్ని ఇతర మైనారిటీ వర్గాల భద్రత మరియు రక్షణకు భరోసానిస్తూ, సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము ఆశిస్తున్నాము. దేశాల ప్రజల ఆకాంక్షలు, శాంతి, భద్రత, అభివృద్ధి కోసం బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.