Site icon NTV Telugu

Bonalu Festival: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ బోనాలు.. హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Bonalu

Bonalu

తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. 11 నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ధ్వజారోహణ, శిఖరవూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13వ తేదీన షాలిబండ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటంను భాజా భజంత్రీలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఆ తరువాత 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జులై 20వ తేదిన ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పన, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జులై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.

READ MORE: Sharmishta Panoli: శర్మిష్ట పనోలి ఎవరు.? మమతా సర్కార్ ఎందుకు అరెస్ట్ చేసింది..

దేశ రాజధాని ఢిల్లిలో లాల్ దర్వాజ బోనాలు..
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత 10 ఏళ్ల నుంచి బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 11వ బోనాల ఉత్సవాలను లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 30, జులై 1, 2 తేదీలలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారము 30వ తేదీన సాయంత్రం 5గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ను పలువురు ప్రముఖులతో ప్రారంభిస్తారు. మంగళవారం 1వ తేదీన సా 4 గంటలకు ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్లో ప్రతిష్టాపన చేస్తారు. బుధవారం 2వ తేదీన ఉదయం 11గం॥లకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము నిర్వహిస్తారు.

Exit mobile version