తమ డిమాండ్ల సాధనకు గత పది రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి తమ ఉద్యమం తీవ్రం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిన్న (శనివారం) నిర్ణయించింది. అలాగే ఈ నెల 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని గ్రామ పంచాయతీ సిబ్బంది హెచ్చరించింది. తమ డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని 12వేల 769 గ్రామ పంచాయతీల్లో పలు కేటగిరీల్లో 50 వేల మంది వర్క్ చేస్తున్నారు.
Read Also: Ts Government: 5,950 మంది వీఆర్ఏలు నీటిపారుదల శాఖలోకి..
గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయడంతో పాటు పీఆర్‌సీలో నిర్ణయించినట్టు రూ.19 వేల కనీస బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు ఇతర కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని గ్రామ పంచాయతీ జేఏసీ చైర్మన్ ఆరోపించారు.
