Bangalore: ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో ఈ మధ్య క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. రోడ్డుపైనే దుండగులు రెచ్చిపోయి దాడి చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొన్ని నెలల నుంచి వరుసగా జరుగుతున్నాయి. తాజాగా ఓ సైంటిస్ట్ ను కొంత మంది లోకల్ గూండాలు కత్తులతో వెంబడించారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలను ఆ శాస్త్రవేత్త ఎక్స్(ట్విటర్) వేదికగా పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఇక విషయంలో వెంటనే స్పందించనందుకు ఆయన పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు.
అసలేం జరిగిందంటే.. ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:45గంటలకు కారులో వెళుతుండగా రౌతనహళ్లి రోడ్డు వద్ద కొంత మంది రౌడీలు అశుతోష్ సింగ్ అనే సైంటిస్ట్ కారును ఆపడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కత్తులతో వారు ఆయన వెంటపడ్డారు. దాడిలో ఆయన కారు అద్దాన్ని వారు ధ్వంసం చేశారు. ఎలాగొలా వారి బారి నుంచి తప్పించుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో ఆయన ఎక్స్(ట్విటర్) ద్వారా జరిగిన విషయంతో పాటు పగలగొట్టిన తన కారు ఫోటోలను షేరు చేశారు. దీంతో ఈ ఘటనపై కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ స్పందించారు.
Also Read: Kaveri water: కర్ణాటకకు షాక్ .. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు
వెంటనే వారిని పట్టుకొని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేసుపై దర్యాప్తు చేయాలని తానే స్వయంగా అధికారులను ఆదేశిస్తానని, దగ్గరుండి కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసకుంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 112 నంబర్ కు కాల్ చేయాలని, పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆయన పేర్కొ్న్నారు. ఇక సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య నేరాలు నిజంగానే పెరిగిపోయాయంటూ అశుతోష్ సింగ్ ట్వీట్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే నగరంలో రౌడీయిజం పెట్రేగి పోయే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అయితే ఆ సైంటిస్ట్ ను కత్తులతో వెంబడించడానికి గల కారణం మాత్రం తెలియలేదు.