Gold and Silver Price Crash: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. దేశీయ మార్కెట్లో ఈ విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.6,000కు పైగా తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.3,000కు పైగా పడిపోయింది..
రూ.6,000కు పైగా తగ్గిన వెండి..
ఈ రోజు MCXలో వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే భారీ పతనం నమోదైంది. వెండి ఫ్యూచర్స్ ధర మంగళవారం కిలోకు రూ.1,69,702 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూ.1,63,533కు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా కిలో వెండిపై రూ.6,000కు పైగా తగ్గుదల నమోదైంది. ఇక, వెండి ధరలు ఇటీవల నమోదైన జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి గణనీయంగా తగ్గాయి. జనవరి 29న ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర చారిత్రాత్మకంగా రూ.4,20,048 స్థాయికి చేరుకుంది. తాజా ధరల ప్రకారం చూస్తే, వెండి తన గరిష్ఠ స్థాయితో పోలిస్తే భారీగా చౌకబడింది. బుధవారం నమోదైన పతనం వెండి మార్కెట్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. గత నెలతో పోలిస్తే నవంబర్లోనూ వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 30న చివరి ట్రేడింగ్ రోజున కిలో వెండి ధర రూ.1,79,132 వద్ద ముగిసింది. నవంబర్ 18 నాటికి అది రూ.1,63,533కు పడిపోయింది. అంటే ఈ నెలలో ఇప్పటివరకు కిలో వెండి ధర ఏకంగా రూ.15,599 మేర తగ్గింది.
10 గ్రాముల బంగారంపై రూ.3,000కు పైగా పతనం
వెండితో పాటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.1,34,223 వద్ద ముగిసింది. అయితే, బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూ.1,31,065కు పడిపోయింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3,000కు పైగా తగ్గుదల నమోదైంది. ఇక, ఈ నెలలో బంగారం ధరల తగ్గుదల కూడా గణనీయంగానే ఉంది. అక్టోబర్ 30న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,485గా ఉంది. నవంబర్ 18 నాటికి అది రూ.1,31,065కు పడిపోయింది. అంటే నవంబర్లో ఇప్పటివరకు 10 గ్రాముల బంగారం ధర రూ.7,420 మేర తగ్గింది. మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లోనూ బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,33260కి దిగి రాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,550 తగ్గి.. రూ.1,22,150కి పడిపోయింది.. ఇక, ఏకంగా రూ.5,000కి తగ్గడంతో కిలో వెండి ధర రూ.1,85,000కు పరిమితమైంది.. మొత్తంగా చూస్తే బంగారం, వెండి రెండింటి ధరల్లోనూ ఈ నెలలో గణనీయమైన పతనం నమోదైంది.

