Dowleswaram Barrage: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకోగా.. సుమారు 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Read Also: Suicide: భార్య రొయ్యల కూర వండలేదని భర్త ఆత్మహత్య
ధవళేశ్వరం బ్యారేజీ దిగువన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నాలుగు ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీటి ప్రవాహానికి కాజ్ వేలు నీటమునిగాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కాజ్ వే నీట మునిగి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల వరద బాధితులు కాజ్ వేలపై ఉన్న వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉధృతికి చాకలి పాలెం – కనకాయలంక కాజ్ వే నీట మునిగింది. దీనితో భీమవరం – కోనసీమ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజల రాకపోకలకు ఇంజన్ పడవలు ఏర్పాటు చేశారు .