Court Theft: గోవాలోని పనాజీలోని కోర్టు సాక్ష్యాధారాల గదిలో ఉంచిన డబ్బు, బంగారం దొంగిలించినందుకు ఒక న్యాయవాది అరెస్ట్ అయ్యాడు. ఫ్లాట్, కారు కొనేందుకు జడ్జీ చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలను న్యాయవాది చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా దొంగతనాన్ని గుర్తించారు పోలీసులు. వాల్పోయికి చెందిన న్యాయవాది ముజాహిదీన్ షేక్‌కు సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలపై కన్నుపడింది. వాటిని చోరీ చేసి ఫ్లాట్, కారు కొనాలని అతడు భావించాడు. చోరీ చేసేందుకు షేక్ నాలుగు రోజుల పాటు కోర్టు ఆవరణలోనే రెక్కీ నిర్వహించాడు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కోర్టుకు వచ్చాడు.
Read Also: Rashmi Gautam: ఆకుల చున్నీతో ఆకట్టుకుంటున్న రష్మీ
టాయిలెట్ రూమ్‌లో దాక్కున్నాడు. కోర్టు సిబ్బంది అంతా వెళ్లిన తర్వాత బయటకు వచ్చాడు. న్యాయమూర్తి చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోకి వెళ్లాడు. అందులో ఉన్న డబ్బులు, నగలు తీసుకున్నాడు. రాత్రి 9.30 సమయంలో కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరోవైపు సాక్ష్యాల గదిలోని డబ్బు, బంగారు ఆభరణాలు మాయం కావడాన్ని మరుసటి రోజు కోర్టు సిబ్బంది గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కోర్టుతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా… న్యాయవాది ముజాహిదీన్ షేక్ ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. ఎనిమిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. గోవాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కోర్టుల్లో కూడా ఈ న్యాయవాది ప్రాక్టీస్ చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.