NTV Telugu Site icon

Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ

Maa Robot

Maa Robot

Maa Robot: కలకు కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మరోమారు నిరూపించాడు గోవాకు చెందిన దినసరి కూలీ. ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు. అయితేనేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు. ఆయన పేరు బిపిన్‌ కదమ్‌. గోవాలో దినసరి కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 40 ఏళ్ల వయస్సు గల కదమ్‌కు 14 ఏళ్ల దివ్యాంగురాలైన కూతురు ఉంది. ఆ అమ్మాయి చేతులు కూడా కదిలించలేని స్థితి ఉంది. తినిపించడం మొదలుకుని అన్ని పనులు చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో మంచానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితం ఆమె కూడా మంచం పట్టింది. తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది.

దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. కదమ్‌ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. ఇలాగైతే లాభం లేదని కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. అలాంటిదేమీ లేకపోవడంతో ఇక లాభం లేదని, తానే ఆ పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్

పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకున్నాడు. దాని సాయంతో నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. ఈ రోబో వాయిస్‌ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్‌ రైస్‌ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు. రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్‌ కమాండ్‌ను వాడుకుంటూ.. ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా అన్నది ఆ అమ్మాయి తెలియజేస్తే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది.