NTV Telugu Site icon

Ghulam Nabi Azad: ఎన్నికల్లో పోటీపై ఆజాద్ ఏమన్నారంటే..!

Azad

Azad

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad).. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తాను దూరంగా ఉండనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే పార్టీ అభ్యర్థుల తరఫున మాత్రం ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆజాద్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సంవత్సరం కావడంతో డీపీఏపీ నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్లమెంటు ఎన్నికలు 100 శాతం అనుకున్న సమయానికే జరుగుతాయని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తనకు ఎన్నికల కమిషన్‌తో కానీ, ప్రభుత్వంతో కానీ ఎలాంటి కాంటాక్టులు లేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయని మీడియాతో ఆజాద్ చెప్పారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఒకవేళ తాను పోటీ చేయాల్సి వస్తే కేవలం ఒకే చోటు నుంచి పోటీ చేస్తానన్నారు. దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనపై మాట్లాడుతూ.. ఆందోళనలు ఇటు ప్రభుత్వానికి కానీ, అటు రైతులకు కానీ మంచిది కాదన్నారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి మోడీని కోరారు.