NTV Telugu Site icon

GHMC: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. 17 నామినేషన్లు దాఖలు

Ghmc

Ghmc

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 15 స్టాండింగ్ కమిటీ సభ్యుల స్థానాలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయని GHMC కమిషనర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కమిటీ సభ్యులుగా నిలబడిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఈ లోపు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసే అవకాశముంది.

Read Also: Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక మాఫియా.. పదివేలకు కొని యాభైవేలకు అమ్ముతున్న కేటుగాళ్లు

అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోని పరిస్థితిలో, ఈ నెల 25వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడికానున్నాయి. GHMC స్టాండింగ్ కమిటీ మున్సిపల్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. నగర అభివృద్ధి, బడ్జెట్ వ్యయాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలపై ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఈ ఎన్నికలు నగర పాలనలో కీలకమైనవిగా మారాయి. ఇప్పటికే అన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ప్రకటించిన GHMC అధికారులు, ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 21వ తేదీ తర్వాత నామినేషన్ల ఉపసంహరణపై క్లారిటీ రానుంది. 25న ఎన్నికలు జరిగితే, GHMC కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.