Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేటలోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో నివాసముంటున్న డాక్టర్ యాదగిరి రావు ఇంట్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఉదయం నుంచే ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
ఇక, గత కొంతకాలంగా యాదగిరి రావుపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు, ఈరోజు ఏకకాలంలో దాడులకు దిగారు. ఈ సోదాల్లో భాగంగా ఆయనకు సంబంధించిన స్థిర, చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు మరియు కీలక ఆర్థిక లావాదేవీల పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతుండగా, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

