రోజురోజుకూ కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రక్తసంబంధుల మధ్యే మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తుల కోసం రక్తసంబంధుకులే ప్రాణాలు తీయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం సొంత కొడుకే కన్నతండ్రిని కాల్చి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం రాత్రి మోడీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధానా గ్రామంలోహరి ఓం చౌదరి (52) స్థానికంగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు ఢిల్లీ-మీరట్ రోడ్డుపై కమర్షియల్ మార్కెట్‌తో పాటు సుమారు 75 బీఘాల భూమి, మొత్తం కలిపి దాదాపు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. హరి ఓం తన భార్య అనిత, ఇద్దరు కుమారులు నిఖిల్, నిషుతో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నిఖిల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ఆస్తి పంచాలంటూ నిత్యం వేధిస్తు్న్నాడు. ఆస్తిని తన పేరుకు బదిలీ చేయాలంటూ తరచూ తండ్రితో గొడవపడేవాడు. బుధవారం రాత్రి నిఖిల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీనిపై తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్తి విషయంలో వివాదం మరింత ముదరడంతో నిఖిల్ తన దగ్గర ఉన్న అక్రమ పిస్టల్‌తో హరి ఓంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో హరి ఓంకు మొత్తం నాలుగు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వాటిలో రెండు ముఖానికి, ఒకటి ఛాతీకి, మరొకటి నడుము కింద భాగంలో తగిలాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో హరి ఓం గతంలో కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు నిఖిల్‌కు సుమారు 25 బీఘాల భూమి, కొన్ని దుకాణాలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. అయినప్పటికీ కుటుంబ ఆస్తిలో ఇంకా పెద్ద వాటా కావాలంటూ నిఖిల్ ఒత్తిడి కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.
2018లో తమ్ముడిపైనా కాల్పులు
నిఖిల్ గతంలో కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 2018లో తన తమ్ముడు నిషుపై కూడా కాల్పులు జరిపి హత్యాయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఆ ఘటనలో నిషు ప్రాణాలతో బయటపడ్డాడు. మోడీనగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ భాస్కర్ వర్మ మాట్లాడుతూ.. నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిఖిల్ బీబీఏ గ్రాడ్యుయేట్ అని, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

