భారత జట్టు కొత్త హెడ్ కోచ్ నియామకానికి సమయం ఆసన్నమైంది. ముందునుంచి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం (జూన్ 18) బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో గౌతీ పాల్గొన్నాడు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో సీఏసీ ఛైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌తో మాట్లాడారు. ఇంటర్వ్యూలో భాగంగా నిన్న ఓ రౌండ్ ముగియగా.. నేడు ఇంకో రౌండ్ ఉంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చే 2-3 ఏళ్లకు తన ప్రణాళికలను సీఏసీ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్లు సమాచారం. రెండో రౌండ్ పూర్తయ్యాక గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశముంది. కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలోంచి గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను కూడా సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. రామన్‌కు కూడా నేడు మరో రౌండ్ ఇంటర్వ్యూకి హాజరవుతారట. అయితే గంభీర్‌నే టీమిండియా హెడ్ కోచ్‌గా చేయడానికి బీసీసీఐ ఆసక్తితో ఉందని సమాచారం.
Also Read: Haris Rauf Fan: నన్ను ట్రోల్ చేస్తే భర్తిస్తా.. నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను!
‘ఈరోజు గౌతమ్ గంభీర్ సీఏఈ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఓ రౌండ్ పూర్తయింది. బుధవారం ఇంకో రౌండ్ ఉంటుంది. డబ్ల్యూవీ రామన్ కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇద్దరితోనూ సీఏసీ కమిటీ సభ్యులు జూమ్ కాల్‌లో మాట్లాడారు. భారత క్రికెట్ పురోగతి కోసం రామన్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. 40 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో సీఏసీ సభ్యులు రామన్‌కు చాలా ప్రశ్నలు సంధించారు. గంభీర్‌ను కూడా చాలా ప్రశ్నలు అడిగారు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే.