Ganja Smuggling: భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ, తనిఖీల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ యోగేంద్ర చారి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ తెల్లవారుజామున భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిపై గంజాయి స్మగ్లర్లు బైక్‌తో దాడి చేశారు. స్మగ్లర్లు అతడిని ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చారి కాలు విరిగింది. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స జరుగుతుంది.
Read Also: Bhatti Vikramarka: దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఇదే చెక్ పోస్ట్ వద్ద వారం రోజుల క్రితం కూడా గంజాయి స్మగ్లర్లు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పారిపోయిన ఘటన జరిగింది. అప్పటి ఘటనలో కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గంజాయి స్మగ్లర్లు చెక్ పోస్ట్ వద్ద వీరంగం సృష్టిస్తూ, పోలీసులను ఢీకొట్టి పారిపోవడం సాధారణంగా మారిపోతోంది. ఈ తరచు జరుగుతున్న ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు స్మగ్లర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ప్రారంభించారు. భద్రాచలం చెక్ పోస్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేసి, సీసీ కెమెరాలను మరింత పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని సూచనలు వినిపిస్తున్నాయి.