Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

Cbn Ganesh Chaturthi

Cbn Ganesh Chaturthi

Ganesh Chaturthi: వాడ వాడలో.. పల్లె పల్లెలో.. ప్రతీ పట్నంలో ఇలా.. ఎక్కడ చూసినా వినాయక చవితి శోభ కనిపిస్తోంది.. ఇక, వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. “ఓం గణేశాయ నమః” అంటూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని తెలిపారు చంద్రబాబు… ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని చెప్పారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే వినాయక చవితి వేడుకలు ప్రజల్లో సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వ భావనను పెంపొందిస్తాయని అన్నారు.

సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక
ధార్మిక కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు… ముఖ్యంగా వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపాలు, సామూహికంగా నిర్వహించే చవితి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని తెలిపారు. వినాయక చవితి వేడుకలు మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యత, సమష్టితత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

ఏపీ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడి పూజలో పాల్గొన్న కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తూ.. సోసల్‌ మీడియా వేదికగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..