బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్.. అడిలైడ్ టెస్టులో ఓడిపోయింది. ఇక బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు 200 పరుగులలోపే భారత్ ఆలౌటైంది.
ఇటీవలి రోజుల్లో భారత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. టీమిండియా వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని, కనీసం 350 పరుగులు చేయాలని సూచించాడు. ‘టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక రోజైనా బ్యాటింగ్ చేయాలి. ఒక రోజులోపే ఆలౌట్ అవ్వడం ఏమాత్రం సరికాదు. స్కోర్ బోర్డుపై కనీసం 350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా.. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్‌కు దిగినప్పుడు 4, 5 స్టంప్ లైన్‌పై ఎక్కువగా బంతులు వేయాలి. బౌన్స్‌ను బాగా ఉపయోగించుకోవాలి. బ్రిస్బేన్‌లో పేసర్లకు ఇదే ప్రధాన అస్త్రం. మూడో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే గత పర్యటనలో ఇక్కడ ఆస్ట్రేలియాని టీమిండియా ఓడించింది’ అని హేడెన్ చెప్పాడు.
బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ ఏడు టెస్టులు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీమిండియా గెలిచింది. 2003లో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా కాగా.. మిగతా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. గబ్బాలో రికార్డు ఏమాత్రం బాగా లేకపోవడం, ఇటీవలి భారత్ ఫామ్. అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.