NTV Telugu Site icon

CM Jagan: ఎల్లుండి నుంచి ‘మేమంతా సిద్ధం’.. బస్సుయాత్ర చేపట్టనున్న సీఎం జగన్

Jagan

Jagan

ఎల్లుండి (బుధవారం) నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్చాపురం వరకు సాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించనున్నారు.

Read Also: Chandrababu: ప్రజలంతా కూటమి గురించే చెప్పుకుంటున్నారు

ముఖ్యమంత్రి జగన్.. ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు బయలుదేరుతారు (వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల) చేరుకుంటారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి)కు చేరుకుని రాత్రికి బస చేస్తారు. కనీసం ఒక నెలపాటు సాగే యాత్ర 21 జిల్లాలను కవర్‌ చేస్తుంది.

Read Also: Atchannaidu: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ.. ప్రభుత్వ సలహాదారుపై ఫిర్యాదు

పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా.. మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించనుంది వైసీపీ. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశంకానున్నారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అంతేకాకుండా.. ఈ బస్సుయాత్రలో కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది.