NTV Telugu Site icon

Mallikarjun Kharge: చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. బెంగళూర్ ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాల భూమి..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయాలను ‘‘ముడా’’ స్కామ్ సంచలనంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ప్రమేయం ఉండటంతో బీజేపీతో పాటు జేడీఎస్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎంపై విచారణకు కర్నాటక గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో, ఆ తర్వాత హైకోర్టు దీనిపై స్టే విధించడం జరిగింది.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. 2024 మార్చిలో ఖర్గే కుటుంబం, ఆయన కుమారుడు రాహుల్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ట్రస్టుకు బెంగళూర్ సమీపంలోని ఏరోస్పేస్ పార్క్‌లో 5 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం కేటాయించడంపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, తన వాళ్లకు భూముల్ని కట్టబెడుతోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. దీనికి ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Yahya Sinwar: ఏం గతి పట్టింది..ఇజ్రాయిల్‌కి భయపడి ఆడవేషంలో హమాస్ కీలక నేత..

ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్‌ కులం (ఎస్‌సి) కోటా కింద మంజూరు చేశారు. ఈ ట్రస్టుకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆయన అల్లుడు, కలబురిగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) ద్వారా హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేటాయించిన 45.94 ఎకరాల్లో 5 ఎకరాలు భాగంగా ఉంది. సైట్ల కేటాయింపులో అవకతవకలపై అవినీతి చోటుచేసుకుందని ఉద్యమకారుడు దినేష్ కల్లహళ్లి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కి ఫిర్యాదు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ని విచారించాలని ఆయన అభ్యర్థించారు.

ఇదిలా ఉంటే రాహుల్ ఖర్గే అర్హత కలిగిన దరఖాస్తుదారుడని, సింగిల్ విండో ఆమోదం ద్వారా మెరిట్ ఆధారంగా సైట్ ఆమోదించినట్లు పాటిల్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు తీసుకోలేదని, సాధారణ కేటగిరీ రేట్ల ప్రకారం పూర్తి మొత్తాన్ని చెల్లించారని చెప్పారు. అయితే, ఈ భూమిని సొంతం చేసుకునేందుకు ఖర్గే కుటుంబం ఎప్పుడు ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలుగా మారారు..? అని బీజేపీ ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఆమోదించబడిన సైట్ పారిశ్రామిక లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పారిశ్రామిక ప్లాట్ కాదని, విద్యా ప్రయోజనాల కోసం అని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఆ స్థలంలో మల్టీస్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నది ట్రస్ట్ ఉద్దేశమని, అది తప్పు ఎలా అవుతుందని బీజేపీని ప్రశ్నించారు.