France: ఫ్రాన్స్‌లో మితవాద, అతివాద చట్ట సభ్యలు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్, ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయింది. ఇది రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. రాబోయే సంవత్సరానికి దేశ బడ్జెట్ గురించి ఆందోళనలను పెంచుతోంది. 60 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ విధంగా కూలిపోవడం ఇదే తొలిసారి. ఫ్రెంచ్ పార్లమెంట్‌లోని 577 సీట్ల దిగువ సభలో 331 మంది సభ్యులు బార్నియర్ మధ్యేతర మైనారిటీ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఓటు వేశారు. బార్నియర్ త్వరలో రాజీనామా చేయనున్నారు. 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా మిచెల్ బార్నియర్ నిలవనున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. మిచెల్ బార్నియర్ ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు.
Read Also: Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని
బడ్జెట్ వివాదాలపై జరిగిన చారిత్రాత్మక అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మితవాద సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా, మారైన్ లె పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది. సంక్షోభం మధ్య 2027 వరకు తన మిగిలిన పదవీకాలాన్ని కొనసాగిస్తానని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. అయితే, మాక్రాన్ ఈ ఏడాది రెండోసారి కొత్త ప్రధానిని నియమించాల్సి ఉంటుంది. మంగళవారం ఫ్రెంచ్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం పడిపోయే ముప్పును మాక్రాన్ తిరస్కరించారు. తనను పదవి నుండి తొలగించడం గురించి చర్చలు ఊహాజనిత రాజకీయాలు అని అన్నారు. నేను ఫ్రెంచ్ ప్రజలచే రెండుసార్లు ఎన్నికయ్యానని చెప్పాడు. “ఇలాంటి విషయాలతో మనం ప్రజలను భయపెట్టకూడదు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.” అని అన్నారు. బార్నియర్ ప్రతిపాదించిన బడ్జెట్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. ఈ రోజుల్లో ఫ్రాన్స్ అప్పులు, పెరుగుతున్న లోటుతో ఫ్రాన్స్ పోరాడుతోంది. 1962లో, బార్నియర్‌కు ముందు ప్రధాన మంత్రి జార్జెస్ పాంపిడౌ కూడా తన రాజీనామాను సమర్పించవలసి వచ్చింది, అయితే తరువాత ఆయనను అధ్యక్షుడు చార్లెస్ డి గల్లె తిరిగి నియమించారు. బార్నియర్‌కు అలా అవకాశం లేదు. 73 ఏళ్ళ వయసులో బార్నియర్ కేవలం 91 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు.