NTV Telugu Site icon

Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Suicide

Suicide

Family Suicide: హైదరాబాద్‌ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ గల తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల బాలిక, దంపతులు, మరో మహిళ ఉన్నారు. నలుగురు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Family Drowned: పండుగపూట విషాదం.. కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు దిగి నలుగురు మృతి

అపార్ట్‌మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దంపతులు ఇద్దరూ పెద్ద హోదాల్లోనే సెటిల్ అయ్యారు. ప్రతాప్‌(34) బీఎండబ్ల్యూ కారు షోరూంలో డిజైనర్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. అతని భార్య సింధూర (32) హిమాయత్ నగర్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి నాలుగేళ్ల వయస్సు గల చిన్నారి ఆద్య ఉంది. అయినా వారు ఇంతటి పిరికి చర్యకు ఎందుకు పాల్పడ్డారని బంధువులు వాపోతున్నారు. అయితే నలుగురు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.

నలుగురు మృతి చెందినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ వెల్లడించారు. ప్రతాప్‌తో పాటు తన భార్య సిందూర, కూతురు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆయన తెలిపారు. సింధూర బ్యాంకు ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా పనిచేస్తోందని.. ఈరోజు డ్యూటీకి రాకపోవడంతో వారి తోటి ఉద్యోగులు తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్ డోర్ వేసి ఉండగా.. కిటికీలోనుంచి చూసే సరికి ప్రతాప్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడని.. డోర్ పగల గొట్టి లోపలికి వెళ్లే సరికి నలుగురు చనిపోయారని ఎస్సై చెప్పారు. తమకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. నాలుగు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించామన్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.