Bribe: లంచం తీసుకుంటూ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. నీటి పారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో పాటు సర్వేయర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కార్తీక్, నికేష్ కుమార్‌తో పాటు సర్వేయర్ గణేష్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. నెక్నాంపూర్‌లో ఓ భవన నిర్మాణానికి సంబంధించిన ఎన్వోసీ అనుమతి కోసం అధికారులు లంచం డిమాండ్ చేశారు. రెండున్నర లక్షలకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా లక్షన్నర ఇవ్వాలంటూ బాధితుడికి అధికారులు చెప్పారు. సర్వేయర్ గణేష్ మరో 40 వేలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ సోదాలు జరిపింది. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీలాల్ నుంచి 65 వేలు, నికేష్ కుమార్ 35 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఒక సర్వేయర్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. వైద్య పరీక్షల అనంతరం ముగ్గురు ఇంజనీర్లు భన్సీలాల్, కార్తీక్, నికేశ్, సర్వేయర్ గణేష్‌లను ఏసీబీ కార్యాలయానికి అధికారులు తీసుకొని వచ్చారు.
Read Also: MLC Jeevan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌ను కాపాడడం ఎవరి తరం కాదు..
అనంతరం ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. బాధితుడు కట్టాలనుకున్న బిల్డింగ్ పక్క నుంచి నాలా వెళ్తుందని..దీంతో నీటి పారుదల శాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. ఈక్రమంలోనే ఎన్ఓసీ కోసం నీటిపారుదల శాఖ అధికారులను బాధితుడు అప్రోచ్ అయ్యాడని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఏఈ కార్తీక్ డబ్బులు డిమాండ్ చేశాడని.. సుమారు లక్షన్నర రూపాయలు తీసుకున్నాడని.. సర్వే చేయడానికి గణేశ్ 40 వేలు డిమాండ్ చేశాడని.. గురువారం కార్తీక్ మరో లక్ష రూపాయలు డిమాండ్ చేశారని ఆయన చెప్పారు. గురువారం బాధితుడితో పాటు ఏసీబీ టీం కూడా నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్ళిందని వెల్లడించారు. రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బాధితుడిని పలు సర్టిఫికెట్‌లు కావాలంటూ తిప్పారని.. చివరకు లక్ష రూపాయలు ఇవ్వడంతో అప్పుడు ఎన్ఓసీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఈ లోపు ఏసీబీ టీం వాళ్ళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్నారు. ఈ కేసు చూసిన తరువాత ప్రభుత్వ శాఖల్లో పలువురు అధికారులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు.