Former Pakistan PM Imran Khan get 14 year jail in Toshakhana Case: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడగా.. తాజాగా తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోజు వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసులలో జైలు శిక్ష పడడం విశేషం. తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీకి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫిబ్రవరి 8 పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. పాక్ మాజీ ప్రధానికి వరుసగా శిక్షలు పడుతున్నాయి.
తోషఖానా కేసుకు సంబందించి అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో విచారణ చేపట్టారు. దోషులుగా తేలడంతో ఇమ్రాన్ మరియు అతని భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఈ ఇద్దరు 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించకుండా నిషేధించారు. అంతేకాదు ఒక్కొక్కరికి 787 మిలియన్ల జరిమానా కూడా విధించారు. అయితే బుష్రా బీబీ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడం గమనార్హం.
Also Read: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదు అయింది. ఉన్నత పదవుల్లో ఉండే పాకిస్తాన్ ప్రముఖులు విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన అనంతరం వాటిని తోషఖానాకు అప్పగించాలి. లేదా సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి కొన్నింటిని సొంతం చేసుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాలో జమ చేయకుండానే విదేశాల్లోనే అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి ఇమ్రాన్ సొంతం చేసుకున్నారట. విచారణలో ఇమ్రాన్ సహా అతడి సతీమణి దోషులుగా తేలారు.