NTV Telugu Site icon

Babar Azam: బాబర్‌ అజామ్‌ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!

Babar Azam

Babar Azam

Basit Ali Fires on ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముగ్గురు భారత స్టార్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మరియు విరాట్ కోహ్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ర్యాంకులపై పాక్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ విస్మయం వ్యక్తం చేశాడు. నవంబర్ 2023 నుండి వన్డే ఆడనప్పటికీ.. బాబర్ అగ్రస్థానంలో ఎలా ఉంటాడని ఐసీసీని ప్రశ్నించాడు. ఐసీసీ ర్యాంకింగ్‌ సిస్టమ్‌ చూస్తే.. బాబర్‌ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లు ఉందని అలీ పేర్కొన్నాడు.

బసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ఐసీసీ వన్డే ర్యాంకులను చూశా. బాబర్ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇతర పేర్లను చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. బాగా ఆడుతున్న ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర పేర్లు లేవు. ఈ ర్యాంకులను చూస్తుంటే బాబర్‌ ఆడకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉంది. ఈ ర్యాంకులను ఇచ్చిందెవరు?, దేని ప్రకారం బాబర్‌, గిల్ టాప్‌లో ఉన్నారు?’ అని ప్రశ్నించాడు.

Also Read: Sanju Samson-KBC 16: సంజూ శాంసన్‌పై ప్రశ్న.. పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్‌! ఎంతపని చేశావయ్యా

‘బాబర్ అజామ్‌ చివరగా గతేడాది ప్రపంచకప్‌లోనే ఆడాడు. అయినా అతడి ర్యాంకు అలానే ఉంది. శుభ్‌మన్‌ గిల్ శ్రీలంకపై ఆడినా గొప్ప ప్రదర్శన చేయలేదు. గత వన్డే ప్రపంచకప్‌లో రచిన్, డికాక్, హెడ్, కోహ్లీ తదితరులు అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. పాకిస్తాన్ తరపున మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ ఒక్కో సెంచరీ బాదారు. అలాంటప్పుడు ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోంది’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.