NTV Telugu Site icon

Vidadala Rajini: నా మీద కట్టు కథ అల్లి ఇదంతా చేస్తున్నారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Rajini

Rajini

Vidadala Rajini: గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే ఈ కుట్రకు దర్శకుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా.. నా మీద అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు. మా కుటుంబాన్ని, నా మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. ఫాలో అప్ మొత్తం నేను చూసుకుంటాను అంటూ నమ్మబలికి, తర్వాత తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు.

Read Also: MI vs CSK : ముంబై ఇండియన్స్ టీంలో కీలక బౌలర్ దూరం.. మూల్యం తప్పదా?

కృష్ణదేవరాయలు గతం నుంచే తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని, 2020లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్‌లో తమ అధికారాన్ని తమపైనే ప్రయోగించారని ఆరోపించారు. రజిని తనపై జరిగిన పోలీస్ దుర్వినియోగాన్ని వివరిస్తూ.. నా ఫోన్ కాల్ డేటాను తీసే ప్రయత్నం చేశారు. ఒక ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటా తీసే హక్కు ఎవరికి ఉంది? మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ల కాల్ డేటా తీస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడరా? అని ప్రశ్నించారు.

ఈ విషయాన్ని అప్పట్లోనే వైఎస్ జగన్‌కు చెప్పానని, ఆయన పోలీసులను ప్రశ్నించగా.. వారు కృష్ణదేవరాయలే చెప్పారని ఒప్పుకున్నారని తెలిపారు. కాల్ డేటా వ్యవహారంపై ఆధారాలు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని హెచ్చరించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. జర్మనీలో ఉన్న మా మరిదిపై కూడా కేసులు పెట్టించారు. మార్గంలో కార్లు పగులగొట్టిస్తారు, అక్రమ కేసులు పెట్టిస్తారు. ఇదంతా రాజకీయ కుట్ర అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read Also: Rishikonda Beach: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి

నా కళ్లలో భయం చూద్దామనే కుట్రలు చేస్తున్నారు. కానీ నేను భయపడను. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడమని.. రాజకీయాల్లోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోలేదని ఆమె అన్నారు. రాజకీయ విలువలు ఎవరి వద్ద ఉన్నాయో ప్రజలకు తెలుసునని రజని పేర్కొన్నారు. తనకు రత్తయ్య గారంటే గౌరవం ఉన్నప్పటికీ, ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు మాత్రం తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నారని రజని ఆరోపించారు. మీ లాంటి వాళ్లు భయపెట్టాలని చూస్తే నేను భయపడనని, న్యాయపరంగా నా పోరాటం కొనసాగిస్తా అంటూ స్పష్టం చేశారు. అలాగే ఆమె రజని టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, విజిలెన్స్ విచారణ చేయిస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఎస్పీ ఎవరు? టీడీపీకి చెందిన వ్యక్తే ఉన్నారు. వారి నివేదిక ఏదైనా సత్యాన్వేషణ చేస్తుందా?” అని ప్రశ్నించారు. ధర్నా చేస్తే కూడా మాపై కేసులు పెట్టించారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. కానీ, ఈ రాజకీయ దాడులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.