SM Krishna: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. శనివారం అర్థరాత్రి వేళ ఆయన అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరానన్న ప్రచారాన్ని ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఎస్ఎం కృష్ణ వయసు 90 ఏళ్లు కాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న ఆయనను గతరాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్‌పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మణిపాల్ హాస్సిటల్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Rajastan: రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?
పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్‌ఎం కృష్ణ అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 2009 నుండి 2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఎస్‌ఎం కృష్ణ కుమార్తె మాళవిక వివాహం కాఫీ డే వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్దార్థతో జరిగింది. వీజీ సిద్దార్థ అనంతరం మాళవిక కాఫీ డే సంస్థను నిర్వహిస్తోంది. ఆ కంపెనీకి ఉన్న ఏడు వేల కోట్లకుపైగా అప్పుల్లో సగం వరకు తీర్చేసింది.
