Site icon NTV Telugu

Phone Tapping Case: టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్ట్‌

Radhakishan Rao

Radhakishan Rao

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 10గంటల పాటు విచారించిన అనంతరం రాధాకిషన్‌రావును అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాధాకిషన్‌ రావును కోర్టులో హాజరుపర్చనున్నారు. విచారణ తర్వాత అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ప్రకటించారు. హవాలా వ్యాపారులు, కొంతమంది ప్రముఖులను అక్రమంగా నిర్బంధించినట్లు విచారణలో తెలిసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారుల నిర్బంధించి డబ్బులు ఒక పార్టీకి చేరవేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు వ్యాపారులపై రాధా కిషన్‌ రావు నిఘా పెట్టినట్లు తెలిసింది.

Read Also: BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేకే, గద్వాల విజయలక్ష్మీ గుడ్‌బై

కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్‌ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Exit mobile version